రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడొచ్చు: ఎస్పీ రాజేష్ చంద్ర
బిక్కనూర్, ఆంధ్రప్రభ: యువత సామాజిక బాధ్యతతో స్వచ్ఛంద రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలోని సౌత్ క్యాంపస్, బిక్కనూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం అత్యున్నత మానవతా సేవ అని, ఒక వ్యక్తి ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణదానంగా మారుతుందని అన్నారు. ముఖ్యంగా థలసేమియా బాధితులు, ప్రమాదాల్లో గాయపడిన వారు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు ప్రతి యూనిట్ రక్తం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.
శిబిరంలో 60 మంది స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేయడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, మద్యం, పొగాకు వంటి చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని యువతకు సూచించారు. సరదాగా ప్రారంభమైన వ్యసనాలు జీవితాన్ని నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తాయని హెచ్చరించారు.
విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించి ముందుకు సాగాలని, చిన్న చిన్న సమస్యలు, ఒత్తిళ్లు లేదా అపజయాలకు ఆత్మహత్య వంటి నిర్ణయాలు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా పోలీసులను సంప్రదించి సరైన మార్గదర్శకత్వం పొందాలని సూచించారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. గంజాయి లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బిక్కనూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఎస్‌ఐ ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ కుమార్ గౌడ్, మండల వైద్యాధికారి హేమీమా, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి అంజయ్య, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
