పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్య
- బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి
- ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటాం..
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి, ఆంధ్రప్రభ : పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎర్కొన్నారు. శనివారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వేములవాడ నియోజకవర్గానికి ఒక మనీహరంగా నిలుస్తుందన్నారు. గత పదేళ్లలో పడావు పడ్డ పనులను ప్రజా ప్రభుత్వంలో ముందుకు సాగుతున్నాయన్నారు.

రూ. 200 కోట్లతో 2600 మందికి వసతితో కూడిన విద్య అందించేందుకు 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచిన నేను నాడు ప్రజా సమస్యలపై కొట్లాడానని గుర్తు చేశారు. త్వరలోనే చందుర్తి మోత్కూరావు పేట రోడ్డుకు భూమి పూజ చేసుకుందామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య విధానంలో సమూల మార్పులు చేస్తున్నారని, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ చార్జీలను పెంచామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనం అందజే స్తున్నామన్నారు.
ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, రుద్రంగి మండల కేంద్రంలో ఏటీసి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుందామన్నారు. హైదారాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేతన్నలకు కోటి చీరలను ఆర్డర్ ఇచ్చామని, గత ప్రభుత్వం పెట్టిన 300 కోట్ల బకాయిల విడుదల చేశామన్నారు. రాజన్న ఆలయాన్ని 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలను అభివృద్ధి చె స్తున్నారన్నారు.
గత ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాట తప్పిందని, తాము వచ్చాకే 50 ఏళ్లలో చేయని రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వేములవాడ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భీమారం, మేడిపల్లి, కథలాపూర్ మండలకు సాగు నీరు అందించే ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటారని, నాడు పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల్లో బస చేసి వారి సమస్యలు గుర్తించారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో నాడు వారి చొరవతో డబుల్ రోడ్డు నిర్మాణం చేశామని, మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో వేములవాడ- సిరికొండ వరకు 3 లైన్లు రోడ్డు మంజూరు చేశారన్నారు. త్వరలోనే కోనరావుపేట మండల పరిధిలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 1000 కోట్ల పనులు జరుగుతున్నాయని, వరి ధాన్యం కొనుగోలు సమయంలో గతంలో కంటే 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎకరణ ఎక్కువ చేశామన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మర్రిపల్లిలో 40 ఎకరాల స్థలంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశామని, రైతులకు భూసార పరీక్షలు చేసేందుకు వీలుగా రైతు విజ్ఞాన కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో పాత ఆలయాన్ని అలాగే ఉంచుతున్నామని, రాజన్న ఆలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం శృంగేరి పీఠాధిపతుల సూచనలతో అభివృద్ధి విస్తరణ చేస్తున్నామని స్పష్టం చేశారు.
