ఎర్రకట్ట ఆర్‌ఓబీకి డీపీఆర్ సిద్ధం..

పశ్చిమ విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్
రైల్వే అధికారులతో కలిసి ప్రతిపాదిత వంతెన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సుజన చౌదరి
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వన్‌టౌన్–టూటౌన్ కనెక్టివిటీకి కీలక ముందడుగు
పూర్తిగా రైల్వే నిధులతో నిర్మాణానికి ఆమోదం
రెండేళ్లలో పనులు పూర్తయ్యే అవకాశమని ఎమ్మెల్యే ఆశాభావం

ఆంధ్రప్రభ, చిట్టినగర్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎర్రకట్ట రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. ఎర్రకట్ట–రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం కాగా, శనివారం పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజన చౌదరి) రైల్వే అధికారులతో కలిసి ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్, ఎర్రకట్ట ప్రాంతాల్లో ప్రతిపాదిత రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజన) చౌదరి రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైన నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వన్‌టౌన్–టూటౌన్ మధ్య కనెక్టివిటీ సమస్య పరిష్కారానికి ఇది కీలక ఘట్టమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా నిరంతరం కృషి చేశామని తెలిపారు. రైల్వే శాఖ నుంచి ఆమోదం పొందేందుకు సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు నిరంతరంగా ఫాలోఅప్ చేసినట్లు చెప్పారు. స్థానిక ఎంపీతో పాటు తాను కూడా పలుమార్లు రైల్వే అధికారులను కలిసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా రైల్వే శాఖ నిధులతోనే వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ తయారీకి కూడా రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అన్ని అనుకూలంగా సాగితే వచ్చే రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తయ్యే అవకాశముందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

వంతెన అందుబాటులోకి వస్తే వన్‌టౌన్–టూటౌన్ మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజలకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని వివరించారు. ఎర్రకట్ట ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్, పైప్‌లైన్ పనులు, వాహనాల రద్దీ కారణంగా ఈ వంతెన నిర్మాణం అత్యవసరమైందని, రెండు దశాబ్దాల క్రితమే నిర్మించాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చడం కూడా పశ్చిమ విజయవాడ ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా)చౌదరి అన్నారు.