జిల్లాలో ఎరువుల కొరత లేదు.. రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో నిల్వలు

ఏపీఏఐయంఎస్ 2.0పై రైతులకు అవగాహన కల్పించాలి.. ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దని అధికారులకు కలెక్టర్ వెట్టిసెల్వి ఆదేశం

ఏలూరు, ఆంధ్రప్రభ: జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్టిసెల్వి ఆదేశించారు.

పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామంలోని శ్రీ శ్రీనివాస ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంప్యూటర్ డేటా, స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, ఎరువుల స్టాక్ బోర్డు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాములోని నిల్వలను రిజిస్టర్‌లో నమోదైన వివరాలతో సరిపోల్చి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఏఏ పంటలు సాగు చేశారో తెలుసుకుని, ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు సులభంగా ఆన్‌లైన్‌లో ఎరువులు బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఎరువుల బస్తాలను స్వయంగా రైతులకు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్టిసెల్వి మాట్లాడుతూ, జిల్లాలో ఎరువుల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు.

ఏపీఏఐయంఎస్ 2.0 (APAIMS 2.0) ద్వారా రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందే అవకాశం కల్పించామని తెలిపారు. అవసరమైతే మొబైల్ నంబర్‌ను కూడా నవీకరించుకునే సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను పారదర్శకంగా అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని, దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

పంట భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువుల కేటాయింపులు యాప్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అవసరమైన ఎరువులను సకాలంలో పొందాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత ఏర్పడకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కె. హబీబ్ బాషా, తహసీల్దార్ ఏ. కృష్ణజ్యోతి, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కె. ఇమామి ఖాసీం, స్థానిక రైతులు, దుకాణ నిర్వాహకులు పాల్గొన్నారు.