ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపునకు కుట్ర: సీపీఐ ఆరోపణ

ఓటర్ల నమోదు గడువు మూడు నెలలు పొడిగించాలని డిమాండ్.. ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్త పాదయాత్రలకు పిలుపు

కర్నూలు, ఆంధ్రప్రభ: ఎస్‌ఐఆర్ (SIR) పేరుతో చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ఈ ప్రక్రియ కారణంగా అర్హులైన లక్షలాది మంది ఓటర్లు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గురువారం కర్నూలులోని టీజీఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) తగిన శిక్షణ లేకుండానే బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. గ్రామసభల ద్వారా ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. ప్రస్తుతం ఇచ్చిన గడువు సరిపోదని, కనీసం మూడు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన 14 అంశాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని కోరారు.

ఆధార్, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి అధికారిక గుర్తింపు పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని ఈశ్వరయ్య అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు తమ జనన తేదీలను ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.

అయోధ్య రామాలయం నిర్మాణం కోసం సేకరించిన నిధుల వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ పాలనలో టెట్, నీట్ వంటి పరీక్షలతో పాటు అనేక ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు.

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని ఆరోపించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేసి ప్రత్యేక నిధులతో రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కరవు ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు మరింత దృష్టి సారించాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఈశ్వరయ్య ప్రకటించారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తామని తెలిపారు.

విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్. మునెప్ప, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నుబానీ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జి. చంద్రలేఖర్, కె. శ్రీనివాసులు, నగర సహాయ కార్యదర్శి సి. మహేష్ తదితరులు పాల్గొన్నారు.