2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్
దేశ ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందుండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
ఏపీ యువతకు శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గొప్ప అవకాశం
2029 నాటికి మరో 75 వేల ఉద్యోగాలే లక్ష్యం
రాజకీయ పార్టీగా కూడా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నాం
తిరుపతి, ఆంధ్రప్రభ: దేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం 220 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.
శ్రీసిటీలో ఏర్పాటు చేసిన శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నూతన విద్యా విధానం, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి విద్యను అందించే గొప్ప అవకాశమని లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఐదు వేల మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కేవలం కొత్త విద్యాసంస్థ మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో నూతన ఆలోచనలకు నాంది పలికే కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులు కేవలం డిగ్రీలు సంపాదించడానికే పరిమితం కాకుండా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మారే సామర్థ్యం, నిరంతరం నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా 2029 నాటికి మరో 75 వేల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని వెల్లడించారు. ప్రస్తుతం శ్రీసిటీలో 31 దేశాలకు చెందిన 200 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు.
దేశ జనాభాలో అధిక శాతం యువతే ఉన్నందున వారి నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని లోకేష్ తెలిపారు. పెట్టుబడిదారులకు ‘స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్’ అనే 3ఎస్ విధానంతో సేవలు అందిస్తున్నామని, పెట్టుబడులు పెట్టిన సంస్థలకు పూర్తి సహకారం అందించే ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాలకు ముప్పు కాదని, కొత్త అవకాశాలను సృష్టించే సాంకేతికత అని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా కూడా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని, భారీ డిజిటల్ డేటా ఆధారంగా అవసరమైన సమాచారాన్ని వేగంగా పొందుతున్నామని వెల్లడించారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యవస్థాపకుడు ఉండేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతు నుంచి చిన్న వ్యాపారి వరకు ప్రతి ఒక్కరూ సాంకేతికతను వినియోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
