ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య లక్ష్మీభాయికి బదిలీ…

  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంపై ప్రభుత్వం కుట్ర.. బీఆర్ఎస్ ఆరోపణ
  • మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పదవి నుంచి హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా నియామకం..
  • లక్ష్మీభాయి ట్రాన్స్‌ఫర్‌పై రాజకీయ రగడ..

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని బదిలీ చేస్తూ తెలంగాణ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణ హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లక్ష్మీభాయి త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

బీఆర్ఎస్ ఆరోపణ

అయితే, ఈ బదిలీపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకే ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బదిలీ చేపట్టారని ఆ పార్టీ ఆరోపించింది. ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కల్పించిన భద్రతను కూడా ప్రభుత్వం తొలగించిందని, అధికార వాహన సౌకర్యాన్ని నిలిపివేసేందుకు ప్రయత్నించిందని బీఆర్ఎస్ పేర్కొంది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన సతీమణిపై బదిలీ రూపంలో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.