సీఎం రేవంత్ ఉరుకొండ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

అలసత్వం ప్రదర్శిస్తే అధికారులపై కఠిన చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

ఊర్కొండ, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలంలోని ఊరుకొండపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గురువారం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా నిర్మిస్తున్న హెలిప్యాడ్ పనులు, ఆలయానికి వెళ్లే మార్గం, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆలయ ఈవో, దేవస్థానం చైర్మన్, అర్చకులతో సమావేశమైన కలెక్టర్.. ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు, పూర్ణకుంభ స్వాగతం, దర్శన ఏర్పాట్లు సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆలయం వెలుపల ప్రముఖులతో ముఖ్యమంత్రి పాల్గొనే భోజన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించి, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, భద్రత, వైద్య సేవలు, పార్కింగ్ తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు.. సమన్వయంతో పనిచేయాలి

ఊరుకొండ రైతు వేదికలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, ఏ శాఖ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని స్పష్టం చేశారు. హెలిప్యాడ్ నుంచి ఆలయం వరకు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక, వైద్య సేవలు, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులకు విత్తనాలు, యూరియా కొరత రాకూడదు

ప్రస్తుతం సాగు సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు విత్తనాలు, యూరియా కొరత తలెత్తకుండా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించి అన్ని ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అరుణ రెడ్డి, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో జనార్దన్ రెడ్డి, డీఎస్పీ, తహసీల్దార్ యూసుఫ్ అలీ, ఆలయ ఈవో సత్యచంద్రారెడ్డి, దేవస్థానం చైర్మన్ మనోహర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.