results | ఎంసెట్ ఫలితంతో విషాదం..

కృష్ణానదిలో దూకి విద్యార్థి బలవన్మరణం
ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించలేక తీవ్ర మనస్తాపం
చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య..
కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు..
నందిగామ ప్రాంతంలో విషాదఛాయలు

results | నందిగామ, ఆంధ్రప్రభ : ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్థులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల నిర్వహించిన ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్ష రాశాడు. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్తాపంతో తీవ్ర నిరాశకు గురైన విద్యార్థి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

స్థానికులు ఘటనను గుర్తించి వెంటనే నదిలో గాలింపు చేపట్టి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతితో కాండ్రపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.