వీబీజీ రామ్‌జీతో గ్రామీణ కార్మికులకు మరింత భరోసా..

చెవుటూరులో పథక పనులకు శ్రీకారం

ఉపాధి రోజులు 125కు పెంపు..
గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత మరింత బలోపేతం : ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

జి.కొండూరు, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించి కార్మికులకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) – వీబీజీ రామ్‌జీ పనులను జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో గురువారం ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ్‌తో కలిసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన వారు కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. పథకం కింద పనులు మంజూరు చేసి, చేసిన పనికి సంబంధించిన వేతనాలను నిబంధనల ప్రకారం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివరించారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పథకం కింద ఒక జాబ్ కార్డుకు ఏడాదికి 100 రోజుల ఉపాధి మాత్రమే ఉండేదని, వీబీజీ రామ్‌జీ అమలుతో దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. దీంతో గ్రామీణ కార్మికులకు అదనంగా 25 రోజుల ఉపాధి లభిస్తుందన్నారు.

ఉపాధి హామీ విభాగంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ అసిస్టెంట్లు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లకు కొత్త హోదాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రతను ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందన్నారు. డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, గ్రామీణ రోజ్‌గార్ సహాయక్, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసోసియేట్, మిషన్ ఇంజినీరింగ్ అసోసియేట్, అసిస్టెంట్ మిషన్ మేనేజర్ వంటి హోదాలు అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

మస్టర్ నమోదు చేసిన 15 రోజుల్లోపు కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేయడం తప్పనిసరి అని, ఆలస్యం జరిగితే పరిహారం చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. అలాగే పని కోరిన ప్రతి అర్హుడికి 15 రోజుల్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జాబ్ కార్డుల స్థానంలో గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఆరు నెలలకు సామాజిక తనిఖీలు నిర్వహించి, పనులు, వేతనాలు, మస్టర్ రోల్స్, చెల్లింపుల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తామని చెప్పారు.

ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ రెడ్రెసల్ వ్యవస్థ, అంబుడ్స్‌పర్సన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు పర్యవేక్షణ, తనిఖీలు, నష్టపరిహారం, శిక్షణ వంటి అంశాలకు ప్రత్యేక నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో సమకూర్చనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ఉపాధికి మరింత బలం చేకూర్చే ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ)తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.