TG | బోడుప్పల్‌లో హైటెన్షన్..

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్‌లో నిర్వహించనున్న భూ పోరాటానికి వెళ్లిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ పోరాటాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసుల అడ్డగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం కవితతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అనంతరం బొల్లారం పోలీస్‌స్టేషన్‌ వద్ద మాట్లాడిన కవిత, ఉప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులు, మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలును మాత్రమే కోరామని, కొత్త డిమాండ్లు ఏవీ చేయలేదని చెప్పారు.

ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలాన్ని కేటాయించాలని మాత్రమే కోరామని, హామీల అమలు కోరితే లాఠీచార్జ్ చేయడం అన్యాయమని కవిత విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.