Former CM | ప్రభుత్వంపై జగన్ విమర్శలు

Former CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయవాడలో పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… క్రాంతి కుమార్ మరణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

క్రాంతి కుమార్‌పై ఎలాంటి కేసులు లేవని, కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎందుకు స్టేషన్‌కు పిలిచారని జగన్ ప్రశ్నించారు. పోలీసుల వేధింపులను తట్టుకోలేకపోతున్నానని వీడియో రికార్డు చేసిన తర్వాతే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందన్నారు.

క్రాంతి కుమార్ తన వీడియోలో మూడు నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని చెప్పాడని, ఆ వీడియోను మరణ వాంగ్మూలంగా పరిగణించి కేసు నమోదు చేయాల్సి ఉండేదని జగన్ అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.