వైసీపీ నేతలకు బండి రామకృష్ణ హెచ్చరిక

  • తీరు మార్చుకోకపోతే తగిన బదులు తప్పదు!
  • రాజకీయ లబ్ధి కోసం సామాజిక వర్గాలను వాడొద్దు: జనసేన నేత ఆగ్రహం

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: అమరావతి రాజకీయ వివాదం ఇంకా చల్లారకముందే మచిలీపట్నంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్‌చార్జి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకోకపోతే జనసేన కూడా అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం ఎస్సీ నాయకులను ముందుకు తెచ్చి, వారి ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయించడం సరికాదని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్‌కు ఎస్సీ సమాజంపై ఎలాంటి వ్యతిరేక భావన లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.

వైసీపీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో జనసేన కూడా తగిన విధంగా గట్టి సమాధానం ఇస్తుందని బండి రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.