తెలుగు నాట సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్…
అభివృద్ధితో పాటు సంక్షేమ సౌధాన్ని నిర్మిస్తున్న నాయకుడు చంద్రబాబు…
సూపర్ సిక్స్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు..
రెండేళ్లలోనే సామాజిక పెన్షన్ల కోసం రూ.68 వేల కోట్లకు పైగా వ్యయం…
పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి నిరూపణ..
గొల్లపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమ
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : పెన్షన్‌ను రూ.1,000 పెంచడానికి ఐదేళ్లు తీసుకున్న జగన్ రెడ్డికి సూపర్ సిక్స్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో పెన్షన్‌ను దశలవారీగా పెంచడంతో ఒక్కో పెన్షన్ లబ్ధిదారుడు ఐదేళ్లలో సుమారు రూ.28 వేల మేర నష్టపోయారని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే సామాజిక పెన్షన్‌ను ఒకేసారి రూ.1,000 పెంచి రూ.4,000కు చేర్చడమే కాకుండా, బకాయిలతో కలిపి రూ.7,000 చొప్పున అందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రతి నెల 62 లక్షలకు పైగా లబ్ధిదారులకు సుమారు రూ.2,700 కోట్ల మేర సామాజిక పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సామాజిక పెన్షన్ల కోసం రూ.68 వేల కోట్లకు పైగా వ్యయం చేసిందని దేవినేని ఉమా పేర్కొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పేదల పండుగగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా పెన్షన్ రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలల పెన్షన్‌ను ఒకేసారి అందించే అవకాశాన్ని కల్పిస్తూ వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు భరోసాగా నిలుస్తున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసిన దేవినేని ఉమా, అభివృద్ధితో పాటు విస్తృత స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేస్తూ సంక్షేమ సౌధాన్ని నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని పేర్కొన్నారు.
