దశాబ్దాల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

  • ముడికే మల్లేష్ యాదవ్

కడెం, ఆంధ్రప్రభ: ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రహదారుల అభివృద్ధి కలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సాకారం చేశారని యూత్ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్ అన్నారు.

బుధవారం కడెం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తున్న ప్రజానాయకుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు.

ఖానాపూర్ మండలం తర్లపాడ్ మీదుగా ఖానాపూర్‌కు వెళ్లే రహదారి ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. ఇరుకైన సింగిల్ రోడ్డు, పెద్ద గుంతలు, ఎదురెదురుగా వచ్చే వాహనాలకు దారి లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఈ సమస్యపై గతంలో పలువురు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు.

అయితే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిరంతర కృషి చేయడంతో తర్లపాడ్–ఖానాపూర్ రహదారి అభివృద్ధికి రూ.7.69 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో రహదారి ఆధునికీకరణ జరిగి వేలాది మంది ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుందని అన్నారు.

అలాగే ఖానాపూర్–దిలావర్‌పూర్–గోసంపల్లి–లింగాపూర్–పాత మద్దిపడగ–చిట్యాల–చిన్న బెల్లాల్ మీదుగా నర్సింగాపూర్ వరకు డబుల్ రోడ్డుకు రూ.67.57 కోట్లు మంజూరు చేయడం ఈ ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తయితే గ్రామాల మధ్య రవాణా మెరుగుపడటంతో పాటు రైతులు పంటలను సులభంగా మార్కెట్లకు తరలించగలరని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర వైద్య సేవలు పొందే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

అభివృద్ధి అంటే కేవలం హామీలు ఇవ్వడం కాదని, ప్రజలకు అవసరమైన పనులకు నిధులు తీసుకురావడమే నిజమైన నాయకత్వమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మరోసారి నిరూపించారని ముడికే మల్లేష్ యాదవ్ కొనియాడారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తున్న నాయకుడు వెడ్మ బొజ్జు అని అన్నారు.