ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచిన యువకుడు
- ప్రకృతి వ్యవసాయంతో లాభాల పంట
- వ్యవసాయమే కెరీర్ గా మార్చుకున్న యువ రైతు ఉదయ్
- స్వయంగా కలిసి అభినందించిన కలెక్టర్ డా. ఏ.సిరి
కర్నూల్ రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ; ఉద్యోగాల కోసం నగరాల బాట పట్టే యువతకు భిన్నంగా.. డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడు వ్యవసాయాన్నే తన కెరీర్‌గా మార్చుకున్నాడు. ప్రకృతి వ్యవసాయం, బహుళ పంటల సాగుతో తక్కువ పెట్టుబడిలోనే ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తూ.. ఆదర్శ రైతుగా నిలిచిన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్.కైరావడికి చెందిన ఉదయ్‌ను జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి స్వయంగా అభినందించారు.
వ్యవసాయమే కెరీర్‌గా…
వ్యవసాయంలో లాభాలు లేవని, యువత పొలం వైపు రావడం లేదనే అభిప్రాయాలకు భిన్నంగా యువ రైతు ఉదయ్ తన కృషితో ఆదర్శంగా నిలిచాడు. ప్రకృతి వ్యవసాయాన్ని ఆధునిక ఆలోచనలతో మేళవించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించే మార్గాన్ని ఉదయ్ ఎంచుకున్న సాగు విధానాననికి కలెక్టర్ డా. ఏ.సిరి ప్రత్యక్షంగా పరిశీలించి ప్రశంసించారు.ఉదయ్ తన పొలంలో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానంలో సాగు చేస్తున్న పంటలను, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వివరాలను యువ రైతుతో నేరుగా మాట్లాడి పెట్టుబడి, దిగుబడి, ఆదాయం, సాగు విధానాలపై వివరాలు తెలుసుకున్నారు.

30 సెంట్ల భూమితో ప్రారంభమైన ప్రయాణం…
డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా వ్యవసాయాన్నే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నట్లు యువ రైతు ఉదయ్ తెలిపారు. తనకు ఉన్న 30 సెంట్ల వర్షాధార భూమితో పాటు కౌలు భూమిని తీసుకుని సాగు చేస్తున్నట్లు చెప్పారు. కౌలు భూమికి ఎకరానికి సంవత్సరానికి రూ.20 వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నట్లు వివరించారు.
ప్రస్తుతం ఒక ఎకరాలో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తూనే, దానితో పాటు ఐదు అంతర (అనుబంధ) పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు, దున్నడం, ఇతర వ్యవసాయ పనులతో కలిపి ఎకరానికి సుమారు రూ.12 వేల వరకు మాత్రమే పెట్టుబడి అవుతోందని చెప్పారు.
ఒకే పొలంలో పలు పంటలు…
ప్రధాన పంట అయిన పత్తి చేతికి వచ్చే వరకు ఆదాయం కోసం ఎదురుచూడకుండా, అంతర పంటల ద్వారా నిరంతర ఆదాయం పొందే విధానాన్ని ఉదయ్ అనుసరిస్తున్నారు. మూడు ఎకరాల భూమిని మూడు ప్లాట్లుగా విభజించి.. ఒక ప్లాట్‌లో పత్తితో పాటు అంతర పంటలు, మరో ప్లాట్‌లో వరి, మిగిలిన భూమిలో నువ్వులు, ఆముదం, సజ్జలు, అలసంద వంటి పంటలను సాగు చేస్తున్నారు.
చౌల, బెండకాయ వంటి కూరగాయల విక్రయం ద్వారానే ఇప్పటికే రూ.7 వేల ఆదాయం పొందినట్లు తెలిపారు. అలాగే ఆకుకూరలు, కాకర, బీరకాయ, చెరకు సాగుతో పాటు పొలం గట్లపై అరటి మొక్కలు నాటి ప్రతి అంగుళాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
ప్రకృతి వ్యవసాయంలో విజయం సాధించిన రైతుల కథనాల నుంచి స్ఫూర్తి పొంది ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు ఉదయ్ తెలిపారు. రసాయన వ్యవసాయానికి స్వస్తి పలికి తొలిసారిగా ప్రకృతి వ్యవసాయం చేపట్టినా, ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

తన వద్ద ఉన్న ఆవుల పేడతోనే ఘనజీవామృతం,.
తన వద్ద ఉన్న ఆవుల పేడ, గోమూత్రాన్ని ఉపయోగించి ఘనజీవామృతం, ద్రవజీవామృతం, నీమాస్త్రం వంటి సేంద్రియ ద్రావణాలను స్వయంగా తయారు చేసుకుని పంటలకు వినియోగిస్తున్నట్లు ఉదయ్ తెలిపారు. దీంతో రసాయన ఎరువులు, పురుగుమందుల కొనుగోలుపై అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గిందని వివరించారు.
పత్తితో లక్షల్లో ఆదాయం..
ప్రస్తుతం సాగు చేస్తున్న పత్తి పంట నుంచి ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని రైతు తెలిపారు. మార్కెట్ ధర అనుకూలంగా ఉంటే ఎకరాకు రూ.1.40 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌కు వివరించారు.
ప్రకృతి వ్యవసాయం… భవిష్యత్‌కు భరోసా..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించవచ్చని అన్నారు. బహుళ పంటల సాగు వల్ల ఒక పంట నష్టపోయినా మరో పంట రైతుకు అండగా నిలుస్తుందని, ఏడాది పొడవునా ఆదాయ ప్రవాహం కొనసాగుతుందని వివరించారు.
ప్రధాన పంట కోతకు వచ్చే వరకు మధ్యలో పండే పంటలను కుటుంబ అవసరాలకు, పశువుల మేతకు వినియోగించుకోవడంతో పాటు విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. యువ రైతు ఉదయ్ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఇతర యువ రైతులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
డిగ్రీ పూర్తి చేసిన యువకుడు వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా మలుచుకుని ప్రకృతి వ్యవసాయంలో విజయాన్ని సాధించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. పట్టుదల, వినూత్న ఆలోచన, కష్టపడే తత్వం ఉంటే వ్యవసాయం కూడా అత్యంత గౌరవప్రదమైన, లాభదాయకమైన వృత్తిగా మారుతుందని ఈ విజయగాథ మరోసారి నిరూపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, వ్యవసాయ అధికారి ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

