కార్యకర్తలే నాయకులుగా ఎదగాలన్నదే జనసేన లక్ష్యం: పిడుగు హరిప్రసాద్

క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేసే వారికి ప్రాధాన్యం.. పదవుల కోసం దరఖాస్తు చేయాలని జనసైనికులకు పిలుపు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలనే సంకల్పంతోనే జనసేన పార్టీ కమిటీల నియామక ప్రక్రియ చేపట్టిందని ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు పిడుగు హరిప్రసాద్ తెలిపారు.

బుధవారం అవనిగడ్డలోని గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దీర్ఘకాల అధ్యయనం ఫలితంగానే ఈ కమిటీల నియామక విధానం రూపుదిద్దుకుందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలతో పాటు విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మత్స్యకార తదితర రంగాలకు చెందిన సుమారు 15 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

సమాజానికి సేవ చేయాలని, రాజకీయంగా ఎదగాలని భావించే ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి తగిన పదవులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనసేనలో కార్యకర్త కార్యకర్తగానే మిగిలిపోకుండా నాయకుడిగా ఎదగాలన్న లక్ష్యంతోనే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారు కూడా తిరిగి దరఖాస్తులు సమర్పించాలని, మచిలీపట్నంలో దరఖాస్తులను అందజేయాలని పిలుపునిచ్చారు.

మండలి బుద్ధప్రసాద్ నుంచి స్ఫూర్తి పొందాను

మాజీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో మండలి బుద్ధప్రసాద్‌కు 2+2 గన్‌మెన్, ఎస్కార్ట్ సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా నిరాడంబరంగా వ్యవహరించారని హరిప్రసాద్ తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తాను ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పటికీ ఆ సౌకర్యాలను తీసుకోలేదని చెప్పారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ఎదుగుదలలో పిడుగు హరిప్రసాద్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పార్టీకి వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఆయనకు కేటాయించడం వెనుక అదే కారణమని అన్నారు. ఓర్పు, నేర్పు, సహనంతో సేవలందిస్తున్న హరిప్రసాద్‌ను జనసైనికులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడిగా హరిప్రసాద్‌ను నియమించడం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యం మరోసారి స్పష్టమైందన్నారు. పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి బలోపేతంలో భాగంగా యువతకు అవకాశాలు కల్పించేందుకు, జెన్-జీ తరాన్ని ప్రోత్సహించేందుకు ఈ కమిటీల నియామక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించి, సేవల ఆధారంగా బాధ్యతలు కేటాయించడం వినూత్న విధానమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త దరఖాస్తు చేసుకోవాలని, అందరూ ఒకే పదవి కోసం కాకుండా ప్రతి ఒక్కరికీ అవకాశం లభించేలా తగిన బాధ్యతలకు దరఖాస్తు చేయాలని సూచించారు.

పవన్ కళ్యాణ్ ప్రతి మాటను ఆచరణలో పెట్టాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. సమాజంలో కుల రాజకీయాలను తగ్గించి సమానత్వానికి ప్రాధాన్యం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యానికి పునాది వేసే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అటవీ శాఖ ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

సర్వజనుల శ్రేయస్సే జనసేన పార్టీ లక్ష్యమని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పించే పార్టీగా జనసేన నిలుస్తోందన్నారు. పార్టీ అధినేత ఇచ్చిన మార్గదర్శకాల మేరకు బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పదవులకు దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకటకృష్ణారావు శతజయంతి సందర్భంగా అవనిగడ్డ వంతెన సెంటర్‌లోని ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి లంకె యుగంధర్, సీనియర్ నాయకుడు బచ్చు వెంకట్‌నాథ్ ప్రసాద్, మండల అధ్యక్షులు మర్రె గంగయ్య, పూషడపు రత్నగోపాల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.