లింక్ సేల్స్‌కు చెక్..

రైతులను బలవంతపెడితే కఠిన చర్యలు

యూరియా, డీఏపీతో ఇతర ఉత్పత్తులు కొనాలని ఒత్తిడి చేస్తే సహించేది లేదు: కలెక్టర్ డా. ఏ. సిరి

కర్నూల్ రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: యూరియా, డీఏపీ ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తులు లేదా లింక్ ఎరువులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైతులను బలవంతపెడితే సంబంధిత ఎరువుల దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి హెచ్చరించారు. లింక్ సేల్స్ పేరుతో రైతులపై ఎలాంటి ఒత్తిడినీ సహించబోమని స్పష్టం చేశారు.

బుధవారం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలోని రాజ్యలక్ష్మి పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీఐఎంఎస్ (APIMS) యాప్ ద్వారా రైతుల వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. అనంతరం రైతులకు స్వయంగా యూరియా, డీఏపీ ఎరువులను పంపిణీ చేశారు.

తనిఖీలో భాగంగా వెంకటేశ్వరరెడ్డి అనే రైతు ఆధార్ నంబర్‌ను ఏపీఐఎంఎస్ యాప్‌లో నమోదు చేసి, ఆయన సాగు విస్తీర్ణానికి అవసరమైన ఎనిమిది యూరియా, ఐదు డీఏపీ బస్తాలను అందజేశారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచాలని దుకాణ యజమానికి ఆదేశించారు.

రైతులు తమ పంట అవసరాలకు అనుగుణంగా అవసరమైన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. యూరియాతో పాటు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఎవరైనా ప్రోత్సహించినా లేదా బలవంతం చేసినా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను దుకాణంలో స్పష్టంగా ప్రదర్శించాలని నిర్వాహకుడికి సూచించారు.

అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి ప్రకృతి వ్యవసాయం, స్థిరమైన సాగు విధానాలను అనుసరించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రసాయన ఎరువుల వినియోగాన్ని శాస్త్రీయంగా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

అధికంగా యూరియా వినియోగించడం వల్ల భూమి సారవంతత తగ్గడంతో పాటు మట్టి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. భావితరాలకు సారవంతమైన భూమిని అందించాలంటే యూరియా వినియోగాన్ని క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. పంటల్లో రసాయన మందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఫలితాలు సాధించిన రైతుల వద్దకు ఇతర రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.