బెల్టు షాపులు బంద్ చేయాలని నిరాహార దీక్ష

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టు షాపుల మద్యం విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అదే గ్రామానికి చెందిన మేడగోని శ్రీనివాస్ గౌడ్ బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు.

గ్రామ బస్టాండ్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి ఆయన దీక్షకు దిగారు. గ్రామంలో 24 గంటల పాటు కొనసాగుతున్న మద్యం అమ్మకాల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపుల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆరోపించారు.

బెల్టు షాపులను తక్షణమే తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.