ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి..

  • బిఆర్ఎస్ నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనతో ఒరిగిందేమి లేదని బిఆర్ఎస్ నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేబీఆర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలు సభల్లో ప్రజా సమస్యల ప్రస్తావన కన్నా బిఆర్ యస్ పార్టీని విమర్శించడానికి ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరమన్నారు.

గతంలో నల్లగొండ అభివృద్ధికి పూనుకుంది మాజీ ఎమ్మెల్యే కంచర్లేనని, బిఆర్ యస్ హాయంలో మొదలు పెట్టిన పనులకే నేడు ప్రారంభాలు జరుగుతున్నాయన్నారు. సిఎం రేవంత్ సభపై ఆశలు పెట్టుకున్న జనం ఆశలు అడియాశలయ్యాయని విమర్శించారు. ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయలేదని, రైతులు యూరియా యాప్ తో గోస పడుతున్నారని, ధాన్యం కొనుగోలు సవ్యంగా జరగలేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ నియోజకవర్గానికి చేసిందేమి లేదని హడావుడి ఆర్భాటాలు తప్ప.. అంటూ పేర్కొన్నారు.

నల్లగొండలో గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ముషంపల్లి, నర్సింగ్ భట్ల, బ్రాహ్మణ వెల్లెంల రోడ్లు అసంపూర్తిగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, పలు గ్రామాల్లో బస్సు సౌకర్యం లేక మహాలక్ష్మి పథకం మహిళలకు దక్కలేదన్నారు. బ్రాహ్మణ వెల్లెంల కాల్వలు పూర్తి చేసి అన్ని చెరువుల్లోకి నీరు వదలాలని, మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్ల పెండింగ్ డబ్బులు ఇవ్వాలని, ప్రమాదకరంగా ఉన్న రోడ్ల వద్ద వేగ నియంత్రణలు, ఫ్లై ఓవర్లు వేయాలని, చేపట్టబోయే రోడ్ల పనులు నాణ్యతతో చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.