జూలై 2న ట్రాఫిక్ మళ్లింపు
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డైవర్షన్లు.. ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలన్న పోలీసులు
తిరుపతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలో జూలై 2న నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీసులు తెలిపారు.
ప్రజల భద్రత, ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించే ఉద్దేశంతో జూలై 2 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ డైవర్షన్లు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
తిరుపతి నుంచి కడప వైపు వెళ్లే వాహనాలను రైల్వే కోడూరు సర్కిల్–చిట్వేలి–బెస్తపల్లి–రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్ మార్గం మీదుగా కడపకు మళ్లిస్తారు. అలాగే కడప నుంచి తిరుపతి వైపు వచ్చే వాహనాలను రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్–బెస్తపల్లి–చిట్వేలి–రైల్వే కోడూరు మార్గంలో వెళ్లేలా ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు తెలిపారు.
ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలి
పుల్లంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు ఓబులవారిపల్లి క్రాస్–చిన్న ఊరంపాడు–వైకోట మార్గం ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్లను తప్పనిసరిగా పాటించాలని, ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలను అనుసరించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర సేవల వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొన్న పోలీసులు, ప్రజల సహకారంతోనే ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు. అసౌకర్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
