2012 బ్యాచ్ ఎస్ఐ ల దుస్థితి..

  • సీఎం గారు కనికరించండి.. డీజీపీ గారు మా మోర ఆలకించండి
  • 14 ఏళ్లుగా పదోన్నతుల కోసం నిరీక్షణ
  • జూనియర్లకు సెల్యూట్ చేయాల్సిన దౌర్భాగ్యం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : 14 ఏళ్లుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న 2012 బ్యాచ్ సివిల్ ఎస్సైలు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 2012 బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ లు ప్రస్తుతం తీవ్రమైన ఆవేదన మధ్య న్యాయమైన అభ్యర్థనను ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఇప్పటికే 14 ఏళ్ల సుదీర్ఘ సేవ పూర్తిచేసినప్పటికీ పదోన్నతి కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొనడం వారిని తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలువురు మంత్రులను కలిసి తమ బాధ వెళ్ళబోసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్ళబోసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఒకే బ్యాచ్ … కానీ హోదాలు వేరు..

2012 బ్యాచ్‌కు చెందిన 45 మంది సబ్ ఇన్స్పెక్టర్లు నాలుగు సంవత్సరాల క్రితమే ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత మరో 25 మంది పదోన్నతి పొందారు. అయితే అదే బ్యాచ్‌కు చెందిన 60 మంది ఇప్పటికీ ఎస్సైలుగానే విధులు నిర్వహిస్తున్నారు. ఒకే బ్యాచ్‌లో చేరిన సహచరులు ఉన్నత హోదాల్లో ఉండగా తాము మాత్రం అదే స్థాయిలో ఉండాల్సి రావడం వల్ల మానసిక ఇబ్బందులతో పాటు వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశం ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాసిన అధికారులు, తమతో పాటు ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వారితో పోలిస్తే వెనుకబడిన పరిస్థితిని వివరించారు. సహచరులు ఉన్నత స్థానాల్లో ఉండగా తాము అదే హోదాలో కొనసాగడం ఆవేదనకు గురిచేస్తోందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

డిప్యూటేషన్‌ తప్పనిసరితో మరింత జాప్యం..

ఇటీవల అమలులోకి వచ్చిన ప్రమోషన్‌కు ముందు రెండేళ్ల పాటు డిప్యూటేషన్ తప్పనిసరిగా చేయాలనే నిబంధన వల్ల ఇప్పటికే పదోన్నతిలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్న 2012 బ్యాచ్ అధికారులు మరింత ఆలస్యం భరించాల్సిన పరిస్థితి వచ్చింది. 14 సంవత్సరాలుగా ప్రమోషన్ లేకుండా సేవలందిస్తున్న అధికారులు మరో రెండేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో లేని నిబంధన … మాకెందుకు..

పోలీసు శాఖలో కంపల్సరీ డిప్యూటేషన్ విధానం ఉన్నప్పటికీ, గతంలో పదోన్నతులు పొందిన ఇతర బ్యాచ్‌లకు ఇది అమలు కాలేదని అధికారులు గుర్తుచేస్తున్నారు. 2004 బ్యాచ్ అధికారులు కేవలం ఆరు సంవత్సరాల సర్వీసులోనే ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందారని 2007 బ్యాచ్ అధికారులు దాదాపు పది సంవత్సరాల సేవల అనంతరం ఒకేసారి పదోన్నతులు అందుకున్నారు. 2009 బ్యాచ్ అధికారులు పన్నెండు సంవత్సరాల సర్వీసులోనే ఉన్నత హోదాలకు చేరుకున్నారు. ఈ బ్యాచ్‌ల విషయంలో కంపల్సరీ డిప్యూటేషన్ నిబంధన అమలు చేయలేదు. అయితే ఇప్పటికే అత్యధిక కాలం పదోన్నతి కోసం నిరీక్షించిన 2012 బ్యాచ్‌పై మాత్రమే ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయడం సముచితం కాదని వాపోతున్నారు.

డీజీపి కరుణ కోసం ఎదురుచూపులు..

2012 బ్యాచ్ అధికారులు సుదీర్ఘకాలంగా పదోన్నతి లేకుండా సేవలందిస్తున్న నేపథ్యంలో, కనీసం ఈ బ్యాచ్‌కు మాత్రమే కంపల్సరీ డిప్యూటేషన్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చేలా డీజీపి కరుణించాలని ఎదురుచూస్తున్నారు. డిప్యూటేషన్ నిబంధన వల్ల ఇటీవల లూప్ లైన్ కు వెళ్లిన అధికారులు ఈరోజు డిజిపి సివి ఆనంద్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు హైదరాబాద్ వెళ్లారు.

సీఎం గారు కనికరించండి..

14 ఏళ్లుగా ఒకే హోదాలో పనిచేస్తున్న తమపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనికరించాలని 2012 బ్యాచ్ ఎస్సైలు వేడుకుంటున్నారు. ఒకే బ్యాచ్ లో ఎంపికైన తాము తమ బ్యాచ్కే చెందిన వారికి సెల్యూట్ చేయాల్సిన దుస్థితి వచ్చిందని విన్నవిస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నారు.