గురుకుల హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు
తాండూరు రూరల్, ఆంధ్రప్రభ: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జినుగుర్తి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం అర్ధరాత్రి ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందపడిపోయింది. మైల్వార్ గ్రామానికి చెందిన మహేశ్వరి అనే విద్యార్థిని ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. భవనంపై నుంచి కింద పడటంతో బాలికకు రెండు కాళ్లు విరిగిపోగా, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కాగా, ఈ ఘటన గురుకుల పాఠశాలలో తీవ్ర కలకలం రేపింది. మహేశ్వరి అసలు ఎలా కిందపడింది? దీని వెనుక కారణాలేంటనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరగా, ఉన్నతాధికారులు సైతం విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
