వైభవంగా ఆదిదంపతుల గిరి ప్రదక్షిణ..

వైభవంగా ఆదిదంపతుల గిరి ప్రదక్షిణ..

ఇంద్రకీలాద్రి పురవీధుల్లో విహరించిన స్వామి వారు అమ్మవారు..
గిరి ప్రదక్షిణకు తరలివచ్చిన భక్తజనం.
నిజ జ్యేష్ఠ పౌర్ణమి వేళ వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
కామధేను అమ్మవారి సన్నిధి నుంచి వైభవంగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ
వేదమంత్రాలు, భజనలు, సంప్రదాయ కళారూపాల మధ్య…
మార్గమంతా కుంకుమ, ప్రసాదాల పంపిణీ..
మహిళల హారతులతో పూజలు
కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు…
పాల్గొన్న ధర్మకర్తలు, అధికారులు..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సకల మనోరథాలు నెరవేరుతాయని ఉన్న విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ప్రారంభించిన చైర్మన్ బొర్రా గాంధీ..
ఉదయం ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి వేదోక్తంగా పూజలు నిర్వహించారు.

సాంప్రదాయ ఆటపాటలతో…
ధర్మ ప్రచారంలో భాగంగా దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేసింది. ఘాట్ రోడ్, శ్రీ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరేలా ప్రదక్షిణ కొనసాగింది. మార్గమధ్యంలో పలుచోట్ల స్థానిక మహిళలు పసుపు నీటితో రహదారులను శుద్ధి చేసి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు సమర్పిస్తూ అమ్మవారికి జయజయధ్వానాలు చేశారు. దేవస్థానం భక్తులకు కుంకుమ, ప్రసాదాలను పంపిణీ చేయగా, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు ఎ. శ్రీనివాసరావు, ఆలయ డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.