గ్రంథాల‌యాల అభివృద్ధికి కృషి

ర‌చ‌యిత‌ల పుస్త‌కాలు ఎక్కువ కొనుగోలు చేసేలా చ‌ర్య‌లు
వ‌చ్చే నెల‌లో అమ‌రావ‌తిలో సెంట్ర‌ల్ లైబ్ర‌రీ నిర్మాణానికి శ్రీ‌కారం
గ్రంథాల‌యాల‌కు పున‌ర్‌వైభ‌వం తీసుకురావ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
రాష్ట్ర‌ గ్రంథాల‌య ప‌రిష‌త్ చైర్మ‌న్ గోనుగుంట్ల కోటేశ్వ‌ర‌రావు
న‌గ‌రంలో ప‌లు గ్రంథాల‌యాల‌ను సంద‌ర్శించిన ర‌చ‌యిత‌లు, క‌వులు, సాహితీవేత్త‌లు
సంద‌ర్శ‌న యాత్ర‌ను జెండా ఊపి ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ‌
బ‌స్సు యాత్ర‌కు విశేష స్పంద‌న..ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన అక్ష‌ర ప్రేమికులు

విజ‌య‌వాడ‌, ఆంధ్రప్రభ : అమ‌రావ‌తి అతిపెద్ద సెంట్ర‌ల్ లైబ్ర‌రీ నిర్మాణ ప‌నుల‌కు జూలైలో శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర గ్రంథాల‌య ప‌రిష‌త్ చైర్మ‌న్ గోనుగుంట్ల కోటేశ్వ‌ర‌రావు అన్నారు. క‌వులు, ర‌చ‌యిత‌ల సంక్షేమానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ర‌చ‌యిత‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో ఆదివారం గ్రంథాల‌యాల సంద‌ర్శ‌న యాత్ర జ‌రిగింది. తొలుత ఈ బ‌స్సు యాత్ర‌ను సివిల్ కోర్టుల వ‌ద్ద ఉన్న విజ‌య‌వాడ బుక్ ఫెస్టివ‌ల్ సొసైటీ గ్రంథాల‌యం వ‌ద్ద ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ జెండా ఊపి లాంఛ‌నంగా ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాల‌యాల ప్రాశ‌స్త్యాన్ని నేటి త‌రం వారికి తెలియ‌జేసే ఉద్దేశంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ర‌చ‌యిత‌ల సంఘం ఇటువంటి యాత్ర చేప‌ట్ట‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు.

ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని స‌హాయ స‌హ‌కారాలు ర‌చ‌యిత‌ల‌కు అంద‌జేసేందుకు తానెప్పుడు సిద్ధంగా ఉంటాన‌ని క‌లెక్ట‌ర్ హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా వీబీఎఫ్ఎస్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ర‌చ‌యిత‌ల సంఘం ఉపాధ్య‌క్షులు పొన్నూరు వేంక‌ట శ్రీ‌నివాసులు అధ్య‌క్ష‌త‌న ప్రారంభ స‌భ జ‌రిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గ్రంథాల‌య ప‌రిష‌త్ చైర్మ‌న్ గోనుగుంట్ల కోటేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ… గ్రంథాల‌య సంస్థ ఆధ్వ‌ర్యంలో ర‌చ‌యిత‌ల పుస్త‌కాల కొనుగోలు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

అమ‌రావ‌తిలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో విశాల‌మైన సెంట్ర‌ల్ లైబ్ర‌రీ నిర్మాణ ప‌నుల‌కు జూలైలో శంకుస్థాప‌న చేస్తామ‌ని రెండేళ్ల‌ల్లో పూర్తిచేసేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని వివ‌రించారు. గ్రంథాల‌యాల ప్ర‌స్తుత స్థితి మార్పు చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్తాన‌ని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా ర‌చ‌యిత‌ల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ జి.వి.పూర్ణ‌చంద్‌, సాహితీ వేత్తలు గుమ్మా సాంబ‌శివ‌రావు, వేముల హ‌జ‌ర‌త్త‌య్య గుప్తా, విజ‌య‌వాడ బుక్ ఫెస్టివ‌ల్ సొసైటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. ల‌క్ష్మ‌య్య‌, త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగించారు. యాత్ర ఉద్దేశాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ర‌చ‌యిత‌ల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ల‌పాక ప్ర‌కాశ్ స‌భ‌కు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా చెన్నాప్ర‌గ‌డ శ‌ర్మ ర‌చించిన క‌విత్వం కురిసింది క‌వితా సంక‌ల‌నం, ఎం.ఎన్‌.వి. ప్ర‌సాద్ ర‌చించిన ఆవ‌కాయ్ శ‌త‌కం, ఎస్‌.ఆర్‌. పృధ్వి ర‌చ‌న ఆరుద్ర స‌ప్త‌తి ఉత్స‌వం పుస్త‌కాల‌ను అతిథులు ఆవిష్క‌రించారు. అనంత‌రం బ‌స్సుల్లో క‌వులు, ర‌చ‌యిత‌లు బ‌య‌లు దేరి న‌గ‌రంలోని ఠాగూర్ గ్రంథాల‌యం, రామ్మోహ‌న్ లైబ్ర‌రీ, హ‌నుమంత‌రాయ గ్రంథాల‌యం, స‌ర్వోత్త‌మ గ్రంథాల‌యాల‌ను సంద‌ర్శించి వాటి విశిష్ట‌త‌ల‌ను అక్క‌డ పుస్త‌కాల‌ను ప‌రిశీలించారు.

ముగింపు వేడుక‌ల్లో ప‌లువురు పాల్గొని వారి సందేశాల‌ను ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సంఘం త‌ర‌ఫున ప్ర‌భుత్వ ఉగాది పుర‌స్కార విజేత గ‌బ్బిట దుర్గాప్ర‌సాద్‌ను స‌త్క‌రించారు. అతిథులు, క‌వులు, ర‌చ‌యిత‌ల‌కు సంస్థ ప‌క్షాన ఆత్మీయ స‌త్కారం చేశారు. కార్య‌క్ర‌మాల‌ను సంఘ ప్ర‌తినిధులు నానా, సోమేప‌ల్లి వ‌శిష్ట‌, శ‌ర్మ సీహెచ్‌. రాజ‌శేఖ‌ర్ పాణిగ్రాహి, కోపూరి పుష్పాదేవి, చింతా ల‌క్ష్మీ సుజాత‌, వేలూరి సుధారాణి త‌దిత‌రులు ప‌ర్య‌వేక్షించారు.