ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు
మైలవరంలో ఘనంగా జయంతి వేడుకలు
మైలవరం, ఆంధ్రప్రభ : మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతిని మైలవరంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, మైనారిటీ ప్రభుత్వానికి సమర్థవంతమైన నాయకత్వం వహించి ఐదేళ్లపాటు విజయవంతంగా పాలన సాగించిన అపర చాణుక్యుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. 1991లో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, దూరదృష్టితో అనేక ఆర్థిక సంస్కరణలను అమలు చేసి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని గుర్తు చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిన నాయకుడిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహారావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. దేశాభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, విదేశాంగ విధానంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల నాగేశ్వరరావు, దోసపాటి గిరిధర్ కుమార్,మసనం సుధాకర్, శీలం రామకృష్ణ, కొత్తగుండ్ల ఆంజనేయులు, అన్నవరపు దుర్గారావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులర్పించారు.
