అమ్మవారికి బంగారు కానుకలు బహూకరణ…

రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాల కానుక
బొట్టు, భూలాకి, నత్తును సమర్పించిన భక్తులు.
ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీకి అందజేత

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు మరో విలువైన కానుకను సమర్పించారు. విజయవాడ కానూరు వాస్తవ్యులు కొండవీటి ఈశ్వరరావు–మాధవి దంపతులు సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు బొట్టు, భూలాకి, నత్తులను అమ్మవారికి కానుకగా అందజేశారు. దేవస్థానం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విలువైన ఆభరణాలను దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణ గాంధీకి దంపతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధానార్చకులు కోట రవి సమక్షంలో విరాళాన్ని అధికారికంగా స్వీకరించారు. అమ్మవారి అనుగ్రహంతో తమ కుటుంబానికి కలిగిన శుభఫలితాలకు కృతజ్ఞతగా ఈ బంగారు ఆభరణాలను సమర్పిస్తున్నట్లు దాతలు తెలిపారు. దాతకు అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయక ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా దాతకు పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.