పోలియోపై విజయం శాశ్వతం కావాలి..!

త‌ప్ప‌నిస‌రిగా చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయించాలి
నేడు రెండు చుక్కలు… రేపటి ఆరోగ్యకర భారతానికి బాటలు
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదివారం విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని అయోధ్య‌న‌గ‌ర్ పీహెచ్‌సీ వ‌ద్ద జ‌రిగిన ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంలో పాల్గొని చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని యూపీహెచ్‌సీల ప‌రిధిలో 966 పోలియో కేంద్రాల్లో కార్య‌క్ర‌మం జ‌రుగుతోంద‌న్నారు.

4,274 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది రూట్ సూపర్‌వైజర్లు పాల్గొన్న‌ట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా కూడా సేవ‌లు అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఏదైనా కార‌ణం వ‌ల్ల ఆదివారం పోలియో చుక్కలు వేసుకోన‌ట్ల‌యితే సోమవారం, మంగళవారం రోజుల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటి సంద‌ర్శ‌నకు వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా చిన్నారుల‌కు పోలియో చుక్కలు వేయించాల‌ని సూచించారు.

విక‌సిత్ భార‌త్‌, స్వ‌ర్ణాంధ్ర సాకారానికి చేస్తున్న కృషిలో భాగంగా ప్ర‌భుత్వం ఆరోగ్య ఆంధ్ర, ఆనంద ఆంధ్ర ల‌క్ష్యంగా ప‌నిచేస్తోంద‌ని.. ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో డీఎంహెచ్‌వో డా. ఇందుమ‌తిదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,డా.చిలకపాటి రామ్ చంద్, రోటరీ గ్రేటర్ అమరావతి అడ్వైజర్, సిబ్బంది పాల్గొన్నారు.