India vs Ireland | నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20

India vs Ireland | నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20

సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిందే
సా.6 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

India vs Ireland | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు నేడు (జూన్‌ 28) రెండో, చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. తొలి టీ20లో 34 పరుగుల తేడాతో అనూహ్య పరాజయం పాలైన టీమిండియా.. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

తొలి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో 148 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి కావడంతో, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ జట్టుపై ఒత్తిడి నెలకొంది.

ఈ మ్యాచ్‌కు తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్ లేదా సూర్యాంశ్ షెడ్గేకు అవకాశం దక్కవచ్చు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మరోవైపు తొలి మ్యాచ్ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఐర్లాండ్.. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న ఆతిథ్య జట్టుకు భారత్ గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంది. సిరీస్ భవితవ్యాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

భారత జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/సూర్యాంశ్ షెడ్గే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

ఐర్లాండ్ జట్టు(అంచనా): టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్/కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హాలార్డ్.