ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పిలుపు

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా భాగస్వాములు కావాలని సూచన

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్న ఆయన, ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వైద్య సిబ్బంది, అధికారులు చేస్తున్న సేవలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు జక్కా రాజు, కౌన్సిలర్లు నిజాం, పడిగె శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.