ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు..

తెలంగాణ లక్ష్యంపై విప్ కీలక పిలుపు

పోలియో రహిత తెలంగాణ కోసం ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కలు వేయించాలని సూచన

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: పోలియో రహిత తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైద్యాధికారులు, స్థానిక నాయకులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ, పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత అని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

రెండు పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో పోలియో చుక్కల కేంద్రాలను అందుబాటులో ఉంచిందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 50 పడకలుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు విస్తరించి, ఆధునికీకరించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్య సేవల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డా. ప్రమోద్ కుమార్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్ నయ్యర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ కొట్టే స్వరూప, పట్టణ కౌన్సిలర్లు, వైద్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.