రెండు చుక్కలు జీవితాంతం రక్షణ..
రెండు చుక్కలు జీవితాంతం రక్షణ..
5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి
జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపు
శ్రీ సత్య సాయి , ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం యెనుమలపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు పోలియో చుక్కలు పిల్లలను జీవితాంతం పోలియో బారిన పడకుండా రక్షిస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో నిర్మూలన కోసం ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని, జిల్లాలోని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి టీకాలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేసి వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 1,011 పోలియో కేంద్రాల ద్వారా సుమారు 1,76,283 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా టీకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచంలోని చాలా దేశాల్లో పోలియో నిర్మూలన జరిగినప్పటికీ, కొన్ని దేశాల్లో ఇంకా వైరస్ కొనసాగుతున్నందున అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విధి నిర్వహణలో వైద్య సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ మనోజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ సంహిత, సీహెచ్‌ఐ వన్నప్ప, శివరాం వైద్య సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
