పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్..

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్..

జిల్లాలో లక్షా 624 మంది చిన్నారులకు పోలియో చుక్కలు
లక్షా 17 వేల 500 డోసులు సిద్ధం, 631 పోలియో కేంద్రాల ద్వారా వంద శాతం లక్ష్యం సాధించాలి,
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి,

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నాగర్‌ కర్నూల్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నాగర్‌ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లు, వ్యాక్సిన్ నిల్వలు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలు, రవాణా సౌకర్యాలు, ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలియో కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ…., పోలియో శాశ్వత వైకల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకర వ్యాధి అయినప్పటికీ, కేవలం రెండు చుక్కల వ్యాక్సిన్‌తో దానిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు.

జిల్లాలోని ప్రతి తల్లిదండ్రి తమ ఐదేళ్లలోపు పిల్లలను సమీపంలోని పోలియో కేంద్రానికి తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
మొదటి రోజు పోలియో కేంద్రాలకు రాని చిన్నారులను గుర్తించి తదుపరి రోజుల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని గిరిజన తండాలు, మారుమూల గ్రామాలు, వలస కూలీల పిల్లలు, నిర్మాణ కార్మికుల పిల్లలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.