అఫ్ఘాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం..

  • 6.2 తీవ్రతతో ప్రకంపనలు..
  • దిల్లీ, జమ్మూకశ్మీర్‌లోనూ కంపించిన‌ భూమి
  • ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అఫ్ఘానిస్థాన్‌లో శనివారం సాయంత్రం రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్‌తో పాటు భారత్‌లోని జమ్మూకశ్మీర్, దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.04 గంటలకు భూకంపం నమోదైనట్లు భారత జాతీయ భూకంప పరిశోధన కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం అఫ్ఘానిస్థాన్‌లో భూమికి 215 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. భూకంప కేంద్రం ఈశాన్య అఫ్ఘానిస్థాన్‌లోని జుర్మ్ పట్టణానికి దక్షిణంగా సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఏర్ప‌డిన‌ట్టు అమెరికా భూభౌతిక సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.

భూకంపం ప్రభావంతో కాబూల్‌లోని పలు భవనాలు కంపించాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాల గోడలకు స్వల్ప పగుళ్లు ఏర్పడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అలాగే బాల్ఖ్, బదఖ్షాన్, నంగర్‌హార్, ఖోస్ట్ తదితర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.

అయితే ఇప్పటివరకు ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తినష్టం జరిగినట్లు అధికారిక సమాచారం వెలువడలేదు. పరిస్థితిని స్థానిక అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతం యురేషియన్, భారత టెక్టానిక్ ఫలకాలు కలిసే భూకంప సున్నిత మండలంలో ఉండటంతో అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.