చదువుకు చేయూత..

  • ప్రతిభకు అండగా దాతృత్వం..
  • విద్యార్థినికి రూ.50 వేల ల్యాప్‌టాప్
  • ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుకాకూడదంటూ.. ల్యాప్‌టాప్ వితరణ

బోనకల్, ఆంధ్రప్రభ : ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఓ దాత పేద విద్యార్థినికి ల్యాప్‌టాప్‌ను అందజేసి అభినందనలు అందుకున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం (ఏ) గ్రామానికి చెందిన భాగం వెంకటరమణ, అదే గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని షేక్ షహనాజ్‌కు శనివారం సుమారు రూ.50 వేల విలువైన ల్యాప్‌టాప్‌ను వితరణగా అందజేశారు.

షేక్ ఫకీర్ కుమార్తె అయిన షహనాజ్ ఉన్నత విద్యాభ్యాసం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆమె చదువుకు ఉపయోగపడేలా ఈ సహాయం చేసినట్లు వెంకటరమణ తెలిపారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు సమాజంలోని దాతలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థిని కుటుంబ సభ్యులు భాగం వెంకటరమణను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు కూడా ఆయన దాతృత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భాగం నాగేశ్వరరావు, మేదరమెట్ల నాగేశ్వరరావు, షేక్ రజ్జి తదితరులు పాల్గొన్నారు.