హైవే ఫుట్‌పాత్‌లపై అక్రమాల తొలగింపు..

మరిపెడ, ఆంధ్రప్రభ : మరిపెడ పట్టణంలోని జాతీయ రహదారి (ఎన్ ఎచ్-563) వెంట ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు, వ్యాపారాలను పోలీసులు తొలగించారు. మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక చర్యల్లో హైవే రోడ్డుపై ఏర్పాటు చేసిన తోపుడు బండ్లు, కొబ్బరి బోండాల దుకాణాలు, జ్యూస్ సెంటర్లు, ఫ్రూట్ బండ్లు, బోండా-బజ్జీల స్టాళ్లు తదితర ఆక్రమణలను తొలగించారు.

ఈ సందర్భంగా ఎస్సై గండ్రాతి సతీష్ మాట్లాడుతూ, జాతీయ రహదారిపై ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల పాదచారులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైవే పరిధిలో మళ్లీ అక్రమంగా వ్యాపారాలు నిర్వహించినా లేదా ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.