స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం.. పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి
గ్రామస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
శనివారం చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేసేలా పార్టీ అభ్యర్థులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసేలా సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు బూత్ స్థాయి నుంచి పార్టీని విస్తరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కార్యకర్తలందరూ చురుగ్గా పాల్గొనాలని, పార్టీ ఓటర్ల పేర్లు తొలగింపునకు గురికాకుండా చూడాలని సూచించారు. అలాగే కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
చిత్తూరు జిల్లా మామిడి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం తోతాపురి మామిడికి కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ప్రకటించడం సంతోషకరమన్నారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా దీర్ఘకాలిక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరవేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. కేంద్ర పథకాల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను విస్తృతంగా వివరించాలని సూచించారు.
జూలై 6న నిర్వహించనున్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలను ప్రజలకు వివరించాలని కోరారు.
జనతా వారధి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేలా పార్టీ నాయకులు పనిచేయాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పార్టీపై విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు.
సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిథ రాజు, జిల్లా ఇన్చార్జి విశ్వనాథ్, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్, పార్టీ నాయకులు గుత్తా నారాయణస్వామి, రవికుమార్, చిట్టిబాబు, వినాయక్, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, సభ్యత్వ విస్తరణ, బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.
