పౌర సరఫరా టెండర్లపై అవకతవకల ఆరోపణలు..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే పాయింట్‌లో పౌర సరఫరా సంస్థ రవాణా వాహనాల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ ఆరోపించారు.

టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి, అర్హతలు లేని వ్యక్తికి కాంట్రాక్ట్ కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. టెండర్‌లో చూపిన వాహనాలు కాంట్రాక్టర్ పేరుపై లేకపోవడం, సమర్పించిన పత్రాల ప్రామాణికతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా? సమర్పించిన పత్రాలు నిజమైనవేనా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, టెండర్ ప్రక్రియపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు.