veligonda project | త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపుతాం

రూ.300 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ నిధుల విడుదల.. జూలై 31 నాటికి ఫేజ్-1 నీటి సరఫరా లక్ష్యం

veligonda project | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: యర్రగొండపాలెం, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కేవలం ఒక సాగునీటి పథకం మాత్రమే కాదని, అది నాలుగు జిల్లాల భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు గొప్ప త్యాగం చేశారని, తరతరాలుగా పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములను ప్రజల మేలు కోసం వదులుకోవడం సాధారణ విషయం కాదని చంద్రబాబు అన్నారు. వారి త్యాగానికి ప్రభుత్వం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.

నాలుగు జిల్లాల తలరాతను మార్చే ప్రాజెక్టు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశంతో పాటు నాలుగు జిల్లాల వ్యవసాయం, తాగునీటి పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాంత భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కరవుకు ప్రతీకగా పేరొందిన మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తాయని ఒకప్పుడు ఎవరూ ఊహించలేదని అన్నారు.

ఎన్టీఆర్ ఆలోచనకు కొనసాగింపే వెలిగొండ

1985లోనే మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ కమిటీని ఏర్పాటు చేశారని, ఆయన హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని చంద్రబాబు తెలిపారు. 1995లో ప్రకాశం జిల్లాకు వచ్చిన ప్రతిసారి రైతులు వరద జలాలను మళ్లించి తమ ప్రాంతానికి నీరు అందించాలని కోరుకునేవారని గుర్తు చేశారు. ఆ ఆకాంక్షను సాకారం చేసేందుకు 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని చెప్పారు.

రూ.10,580 కోట్లతో ప్రాజెక్టు

ప్రస్తుత అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.10,580 కోట్లు వ్యయం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు రూ.6,736 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.3,844 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. తొలి విడతలో రూ.1,932 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా, అందులో రూ.1,906 కోట్ల పనులు మిగిలి ఉన్నాయని వివరించారు.

ప్రభుత్వం వచ్చాక పనులకు ఊపు

2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు రూ.759 కోట్లు ఖర్చు చేశామని, నిర్వాసితుల పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్) కోసం రూ.905 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామని, రెండు రోజుల్లో 2,351 మంది నిర్వాసితుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని వెల్లడించారు.

11 గ్రామాల నిర్వాసితులకు లబ్ధి

కలనూతల, సుంకేశుల, చింతలముడిపి, బుడుంచెర్ల, కాటంరాజు తండా, సాయిరాం నగర్, మెట్టిగొంది, బసవాయిపల్లి, లక్ష్మీపురం, అక్కచెరువు, గొట్టిపాడు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ నిధులు అందజేస్తున్నామని చెప్పారు. కొంతమంది నిర్వాసితులకు కలెక్టరేట్ సమీపంలో పునరావాసం కల్పిస్తున్నామని, కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు నిర్వాసితుల కాలనీ వద్దే కలెక్టరేట్ ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిర్వాసితుల కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా పూర్తి చేశామని తెలిపారు.

వచ్చే ఏడాదికే పూర్తి

మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ పనులపై ప్రత్యేక శ్రద్ధతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని, టన్నెల్ పనులను స్వయంగా పరిశీలిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తన పుట్టినరోజు కూడా ప్రాజెక్టు వద్దే జరుపుకోవడం ఆయన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు.

వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసితుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లు

జూలై 31 నాటికి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ద్వారా నీటి సరఫరా ప్రారంభించేలా వేగంగా పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫేజ్-1 కింద 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. ఫేజ్-2 పూర్తయిన తర్వాత మరో 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

మొత్తంగా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని పేర్కొంటూ, “వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఓ చరిత్ర… రైతుల త్యాగాలకు శాశ్వత ఫలితం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.