WhatsApp Group | వాట్సాప్ వివాదం.. పోలీసుల వరకు వెళ్లిన వ్యవహారం

గ్రూప్ అడ్మిన్ వర్సెస్ సభ్యురాలు
వాట్సాప్ గ్రూప్‌లో మళ్లీ యాడ్ చేయించండి
పోలీసులకు మహిళ ఫిర్యాదు..

WhatsApp Group | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్–12 పరిధిలో ఉన్న ఎన్‌బీటీ నగర్ బస్తీ సమస్యలపై చర్చించేందుకు స్థానికులు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో చోటుచేసుకున్న వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

సమాచారం ప్రకారం… బస్తీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రూప్‌లో ఇటీవల కొందరు సభ్యులు రాజకీయ సందేశాలు పోస్టు చేయడం ప్రారంభించారు. దీంతో గ్రూప్ అడ్మిన్ సభ్యులందరికీ ఎలాంటి రాజకీయ పోస్టులు చేయవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే హెచ్చరికల అనంతరం కూడా ఓ మహిళ వరుసగా రాజకీయ సందేశాలను పోస్టు చేస్తూనే ఉండటంతో, గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించారని భావించిన అడ్మిన్ ఆమెను గ్రూప్ నుంచి తొలగించినట్లు సమాచారం.

తనను తిరిగి గ్రూప్‌లో చేర్చాలని సదరు మహిళ అడ్మిన్‌ను కోరగా, ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చర్య వల్ల తాను మానసికంగా వేధింపులకు గురయ్యానంటూ ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రూప్ అడ్మిన్‌ను స్టేషన్‌కు పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఆమెను తొలగించామని, తిరిగి చేర్చే ఉద్దేశం లేదని అడ్మిన్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.