కొత్త రోడ్డు వేయరు.. పాత రోడ్డు బాగు చేయరు!
- గుంతలమయంగా మారిన కాల్టెక్స్ – కన్నాల ప్రధాన రహదారి
- నిత్యం ఇదే దారిలో వెళ్తున్నా అధికారులకు లేని ‘సోయి’
- వర్షపు నీటితో వాహనచోదకులకు తప్పని ప్రమాదాలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాల్టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు గల ప్రధాన రహదారి పూర్తిగా చెడిపోయి గుంతలమయంగా మారింది. ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రజలు, వాహనచోదకులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు డివిజన్ స్థాయి అధికారులు ప్రతిరోజూ ఈ గతుకుల రోడ్డు గుండానే ప్రయాణిస్తున్నా.. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

కొద్ది నెలల క్రితమే ఈ ప్రధాన రహదారికి కొత్త బీటీ రోడ్డు మంజూరైనప్పటికీ.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. కొత్త రోడ్డు సంగతి దేవుడెరుగు కానీ.. ఉన్న రోడ్డు పెద్ద పెద్ద గుంతలుగా మారినా కనీసం తాత్కాలిక మరమ్మతులు (ప్యాచ్ వర్క్) కూడా చేయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఏది రోడ్డు, ఏది గుంతో తెలియక నిత్యం వాహనచోదకులు ఆ గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేయించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
