ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించిన బీఎల్ఏ-2 బృందం
చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) జూన్ 25 నుంచి ప్రారంభమైనట్లు బీఎల్ఏ-2 ఇంచార్జ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, బీఎల్ఏలతో కలిసి ప్రజలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదు చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని చెప్పారు. ఓటర్లు తమ కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ఫారాలను సమర్పించాలని సూచించారు.
ఫారంలో పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు తదితర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2002 తర్వాత జన్మించిన ఓటర్లు తమ తల్లిదండ్రుల జనన వివరాలను కూడా అందజేయాలని తెలిపారు. అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏ-2లు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఓటర్లు తమ వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు, బాధ్యత అని పేర్కొంటూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
చిన్నకాపర్తి, బోయగుబ్బ, మొర్సుగూడెం, మొగిలిదొరి గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు బెల్లంకొండ రాజు, వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, బీరం రత్నారెడ్డి, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
