యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి..
- దేవలమ్మ నాగారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు
- మాదకద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులతో ప్రతిజ్ఞ
- చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల (డ్రగ్స్) వంటి అలవాట్లకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి.మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం చౌటుప్పల్ మండలం లోని దేవలమ్మ నాగారం ప్రభుత్వ విద్యాసంస్థలో విద్యార్థులకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కన్నవారి కలలు, చదువు, భవిష్యత్తు పూర్తిగా నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకూడదని, ఎవరైనా డ్రగ్స్ వాడాలని ఒత్తిడి చేసినా లేదా విక్రయించడానికి ప్రయత్నించినా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వచ్చే తప్పుడు ప్రలోభాలకు లోనుకాకుండా, మంచి స్నేహితులను ఎంచుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. చదువుతో పాటు క్రీడలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కోరారు.
మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతామంటూ విద్యార్థులందరితో సీఐ ప్రతిజ్ఞ చేయించారు. “నేను మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని… డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని… తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను – జైహింద్” అని విద్యార్థులు ముక్తకంఠంతో నినదించారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కనకటి యాదగిరి, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యాసంస్థల యాజమాన్యం, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
