AI Gender Bias | కృత్రిమ మేధలో పెరుగుతున్న లింగ వివక్షపై ఐరాస హెచ్చరిక
AI Gender Bias | కృత్రిమ మేధలో పెరుగుతున్న లింగ వివక్షపై ఐరాస హెచ్చరిక
AI Gender Bias | ఏఐ వ్యవస్థల్లో లింగ, జాతి వివక్షకు ఆధారాలు
స్త్రీలపై మూస ధోరణులను ప్రతిబింబిస్తున్న సమాధానాలు
ఆన్లైన్ వేధింపులకు ఏఐతో పెరుగుతున్న ముప్పు
సమానత్వం నేర్పాల్సిన అవసరంపై ఐరాస పిలుపు
AI Gender Bias | న్యూయార్క్: మానవుల నుంచి లింగ వివక్ష, జాతి వివక్షలను కృత్రిమ మేధస్సు (ఏఐ) నేర్చుకుంటోందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఒక నివేదికలో పేర్కొంది. 133 ఏఐ వ్యవస్థలపై జరిపిన అధ్యయనంలో 44 శాతం వ్యవస్థలు లింగ వివక్షను, 25 శాతం కంటే ఎక్కువ వ్యవస్థలు లింగ, జాతి వివక్షలను ప్రదర్శించాయి.
స్త్రీలను ఇల్లు, కుటుంబం, పిల్లల సంరక్షణతో ముడిపెట్టి, పురుషులను వ్యాపారం, నాయకత్వం, వృత్తి విజయాలతో అనుసంధానం చేశాయి. కొన్ని సందర్భాల్లో స్త్రీలను లైంగిక వస్తువులుగా లేదా పురుషులకు లోబడిన వారిగా చిత్రీకరించే సమాధానాలను ఏఐ వ్యవస్థలు ఇచ్చాయి. సాధారణ వాక్యాలను పూర్తి చేయమని అడిగినప్పుడు ప్రతి ఐదు సమాధానాల్లో ఒకటి లింగ వివక్ష లేదా స్త్రీ వ్యతిరేకతతో నిండి ఉంది. కొన్ని సమాధానాలు స్త్రీలను ఆస్తి లేదా వస్తువులుగా వర్ణించాయి.
ఇ-మెయిళ్లు రాయడం, ప్రెజెంటేషన్లు తయారు చేయడం, కంటెంట్ రూపొందించడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనుల్లో కోట్లాది మంది ఏఐను వాడుతున్నందున ఈ వివక్షలు సమాజంలో మరింత బలపడుతున్నాయి.
ఆన్లైన్ వేధింపులకు ఏఐ మద్దతు
ఆన్లైన్లో స్త్రీలు ఎక్కువ దుర్బలత్వానికి గురవుతున్నారు. ఏఐ కొన్ని హింసా రూపాలను సృష్టించి వ్యాప్తి చేయడం సులభం చేస్తోంది. మహిళా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల్లో నాలుగో వంతు మంది ఏఐ సహాయంతో ఆన్లైన్ హింసను ఎదుర్కొన్నారు. కొంతమంది వ్యక్తిగత చిత్రాలు అనుమతి లేకుండా షేర్ చేయబడ్డాయి. డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోలతో టార్గెట్ అయ్యారు.
ఏఐకి సమానత్వం నేర్పాలి
ఏఐ అభివృద్ధి నుంచి అమలు, వినియోగం వరకు ప్రతి దశలో లింగ సమానత్వం, మహిళలు, బాలికల హక్కులు, అనుభవాలను చేర్చాలని ఐరాస మహిళా విభాగం యూఎన్ ఉమెన్ కోరుతోంది. జాతి వివక్ష కూడా అనేక వ్యవస్థల్లో కనిపించింది. మానవ మేధస్సును భర్తీ చేయడం కంటే మానవుల దుర్మార్గాలు, వివక్షలను ఏఐ వారసత్వంగా తీసుకోకుండా చూడడం ప్రస్తుతం మానవాళి ముందు అతిపెద్ద సవాలుగా నిలిచింది.
