ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న లోకేష్
- వడ్డెరలకు క్వారీల్లో 33 శాతం వాటా…
- జీవో నెం.126 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రభ : యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాదయాత్రలో తమ సంప్రదాయ కులవృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని వడ్డెర సంఘాల ప్రతినిధులు తనను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, క్వారీల్లో 33 శాతం వాటాను వడ్డెరలకు కేటాయిస్తూ జీవో నెం.126ను జారీ చేసిందని లోకేష్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు వారి సంప్రదాయ వృత్తికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని లోకేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
