నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..

  • సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాయి బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు లకుడారం మాణిక్ ప్రభు డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ అతిథి గృహంలో నిర్వహించిన నాయి బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆలయాల్లో సేవలందిస్తున్న నాయి బ్రాహ్మణులను గుర్తించి, ఆలయ కమిటీల్లో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ డైరెక్టర్లుగా నియమించాలని కోరారు. సమాజంలో ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత పరిరక్షణలో నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకమైందని, ప్రాచీన కాలం నుంచి క్షౌరవృత్తి ద్వారా సమాజానికి విశేష సేవలు అందిస్తున్న ఘనత వారికి దక్కుతుందని పేర్కొన్నారు.

సంప్రదాయ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవనోపాధికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జీవనోపాధి పరిరక్షణకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. క్షౌరవృత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా నాయి బ్రాహ్మణ యువత, మహిళలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలని కోరారు. 50 ఏండ్లు దాటిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, కార్యనిర్వాహక అధ్యక్షులు సాయినాథ్, యూత్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు, అధ్యక్షులు చరణ్, ప్రధాన కార్యదర్శి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, మురళి, స్వాగత్ ప్రభు, పెంటయ్య, హనుమంతు, సాయి కిరణ్, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య, ప్రధాన కార్యదర్శి సుకుమార్, సత్యనారాయణ, మహిళా కమిటీ సభ్యులు సుధామణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.