56 Padma Shri Awards | రాష్ట్రపతి చేతుల మీదుగా ఘనంగా అవార్డుల అందజేత

మమ్ముట్టికి పద్మభూషణ్.. రోహిత్ శర్మ, మురళీమోహన్‌కు పద్మశ్రీ

56 Padma Shri Awards | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ అవార్డులు అందజేశారు. కళలు, సాహిత్యం, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులు ఈ గౌరవాలను అందుకున్నారు.

మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ నిపుణుడు నోరి దత్తాత్రేయుడుకు కూడా పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు.

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. అలాగే ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ కూడా పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది.

దేశ అభివృద్ధికి, సమాజానికి, తమ తమ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులను గౌరవించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ అవార్డులు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి.