విత్తనాల మేళాలో మెరిసిన గుడిరేవు విద్యార్థులు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల వేదికగా నిర్వహించిన విత్తనాల మేళాలో గుడిరేవు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన విత్తనాల సేకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. వ్యవసాయ సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులు సేకరించిన రకరకాల విత్తనాల ప్రదర్శన సందర్శకులను కనువిందు చేసింది.మంగళవారం లింగాపూర్ వ్యవసాయ క్షేత్ర అధికారి మాట్లాడుతూ.శ్రీకన్య మన రాష్ట్రంలో కొద్ది దశాబ్దాల క్రితం వరకు సుమారు 5400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి, 3500 రకాల వంకాయ రకాలు అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు.
అయితే, సంప్రదాయ విత్తనాలను భద్రపరచడంలో జరిగిన అశ్రద్ధ కారణంగా అనేక విలువైన రకాలు నేడు కనుమరుగయ్యాయని అన్నారు. వ్యవసాయంపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహనకల్పిస్తూ సంప్రదాయ విత్తనాల రకాలు, పూర్వీకులు వాటిని నిల్వ చేసిన విధానం, విత్తనాల ప్రాముఖ్యత, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై ప్రత్యక్షంగా వివరించారు. దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరచడంలో ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న, ఉపాధ్యాయురాలు శ్యామల, విద్యార్థులు పాల్గొన్నారు.
