చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి..

రెండేళ్లలో వైసిపి నాయకులపై ఎన్నో కేసులు…
కక్ష సాధింపే ఎజెండాగా ఎమ్మెల్యే గద్దె…
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్..

విజయవాడ, ఆంధ్రప్రభ : గడచిన రెండు సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో వైసిపి నాయకులే లక్ష్యంగా కేసులు పెడుతూ ఉన్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై పలు అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. గద్దె రామ్మోహన్ ప్రజలకు ఒక విధంగా మాట్లాడి, వాస్తవానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తనపై కేసుల విషయంలో, “అవి వాస్తవమైతే ఇప్పటికే శిక్ష పడేదని” పేర్కొంటూ, అధికారంలో ఉన్నందున నిరూపించాలని సవాల్ విసిరారు. గత పాలనపై వ్యాఖ్యానిస్తూ తమ ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ధైర్యంగా చెప్పగలమని ఆయన అన్నారు. అదే సమయంలో ప్రస్తుత పాలనపై విమర్శలు చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గణనీయమైన పనులు జరగలేదని అభిప్రాయపడ్డారు. తూర్పు నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల్లో వైసీపీ శ్రేణులపై కేసులు నమోదయ్యాయని, రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

సోషల్ మీడియా పోస్టుల కారణంగా పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వేధించారని కూడా పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు సంబంధించిన చర్యలు, కూరగాయల బండ్లు తొలగింపు, రంగులు వేయించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ఏపీఐఐసీ కాలనీ రైతు బజార్ వద్ద దేవినేని నెహ్రూ విగ్రహం ధ్వంసం జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలో స్పా సెంటర్లు, కాంట్రాక్టులు, రేషన్ వ్యవస్థ, అక్రమ కట్టడాలు వంటి అంశాల్లో నెలవారీ వసూళ్లు జరుగుతున్నాయని అవినీతి ఆరోపణలు చేశారు. రిటైనింగ్ వాల్, రోడ్లు, పార్కులు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతుల పనులు గత వైసీపీ పాలనలోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ తరఫున పోరాటం కొనసాగుతుందని దేవినేని అవినాష్ తెలిపారు.