ప్రభుత్వ భూముల సర్వే వేగవంతం చేయాలి..
- అర్హులైన పేదలకు ప్రభుత్వ స్థలాల పంపిణీ
- నరేగా పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలి..
- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : గతంలో ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల పంపిణీకి ప్రభుత్వ భూముల సర్వే వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సందర్శించి ఎంపీడీవో, తహసీల్దార్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెన్నంపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూముల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలకు ఇదివరకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాలకు పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని తెలిపారు. పెద్దంపేట గ్రామంలో గోదాం నిర్మాణం కోసం గుర్తించిన 10 ఎకరాల భూమికి సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి భూమిని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవోకు సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద మంజూరైన సీసీ రోడ్ల పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని, అందుబాటులో ఉన్న నరేగా నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు, నరేగా పనులకు సంబంధించిన బిల్లులు త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముత్తారం మండలంలోని ఓడేడు శివారులోని వెంకటేశ్వర్లపల్లి గ్రామ పరిధిలో సీలింగ్ భూములను పరిశీలించారు. భూముల స్థితిగతులను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ డా.రాముడు, ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ ఇంచార్జ్ ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, అధికారులు ఉన్నారు.
